బొండపల్లి, బోడసింగిపేట గ్రామంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి గ్రామానికి చెందిన తిరుమలరాజు సూర్యనారాయణ రాజు(51) విజయనగరంలోని ప్రదీప్ నగర్లో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది నెలలుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పాటు మానసిక వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్కూల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రూపా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.