ఆరేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు తండ్రి కళ్లముందే బండి కింద పడి మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అనంతపురం జిల్లా, కణేకల్లు మండల కేంద్రానికి చెందిన కురుబ ఎర్రిస్వామి, శారదకు జశ్వంత(6), ప్రవీణ్ సంతానం. జశ్వంత స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. కాగా ఎర్రిస్వామి శుక్రవారం ఉదయం తనకున్న దున్నపోతులను బండికి కట్టుకుని స్థానిక వేదావతి హగరిలో ఇసుక తోలేందుకు బాడుగ ఒప్పుకుని వెళ్లాడు.
దసరా సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉన్న జశ్వంత తాను వస్తానంటూ తండ్రి వెంట పడ్డాడు. చేసేది లేక ఎర్రిస్వామి కుమారుడిని వెంటపెట్టుకుని హగరి నదికి వెళ్లాడు. అక్కడ బండిలో ఇసుకను నింపుకుని వస్తుండగా దిగువ గేరిలోని పాత సినిమా హాలు వద్ద గుంతలు రావడంతో బండిలో ఇసుక చెదురు ముదురైంది. దీన్ని సరిచేయాలని ఎర్రిస్వామి బండి దిగి వెనుకవైపునకు వెళ్లాడు. జశ్వంత బండిపై అలాగే కూర్చున్నాడు. నిద్రమత్తులో ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కింద పడిపోగా దున్నపోతులు ఒక్కసారిగా ముందుకు కదిలాయి. దీంతో ఇసుక బండి జశ్వంతపై వెళ్లింది. బండి వెనుకవైపు ఉన్న ఎర్రిస్వామి బండి ఎందుకు కదిలిచ్చావురా అని చూడగా అప్పటికే జశ్వంతపైన బండి వచ్చేసింది. స్పృహ లేకుండా ఉన్న జశ్వంతను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.