శరన్నవరాత్రుల నేపథ్యంలో విశాఖపట్నంలోని సాగరిగిరి కనకదుర్గ ఆలయానికి సముద్ర మార్గంలో వెళ్లి దర్శించుకునే అవకాశం కలిగింది. హిందూస్థాన్ షిప్‌యార్డ్ సమీపంలోని కొండపై ఉన్న సాగరగిరి కనకదుర్గమ్మ గుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట విశాఖ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతుండగా.. సముద్రంలో అమ్మవారి విగ్రహం దొరికింది. దీంతో ఓ కాంట్రాక్టర్ సముద్రం ఒడ్డున దట్టమైన అడవితో నిండిన కొండపై ఆలయం నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాగరిగిరి పిలిచే ఈ ప్రాంతంలో అమ్మవారి ఆలయంతో పాటు, దుర్గామల్లేశ్వరస్వామి, గణపతి, కామేశ్వరీ దేవి ఆలయాలు, నవగ్రహ విగ్రహాలు ఉన్నాయి.
షిప్‌యార్డు సమీపంలోని ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో షిప్‌యార్డు సమీపంలోకి చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. గాజువాక నుంచి వెళ్లే భక్తులు సింధియా మీదుగా హిందుస్థాన్ షిప్‌యార్డు వెనుక ఉన్న ఆలయానికి సొంత వాహనాలు, ఆటోల్లో గాని వెళ్తుంటారు. కానీ, దసరా ఉత్సవాల జరిగే తొమ్మిది రోజులు మాత్రం సముద్రంలో నుంచి బోట్లపై ప్రయాణించే వీలుంటుంది. పాతపోస్టాఫీసు జంక్షన్2కు చేరుకుని, పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయన పక్కన జెట్టీ నుంచి బోట్లు ఎక్కి అమ్మవారి ఆలయం కొండ వద్దకు చేరుకోవచ్చు. బోటు దిగిన తర్వాత ఉచిత ఆటోల్లో కొండపై ఆలయానికి వెళ్లొచ్చు. రోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పోర్టు జెట్టీ వద్ద బోట్లు అందుబాటులో ఉంచారు.
దేవాలయం చుట్టూ ఉన్న విశాలమైన పచ్చని కొండలు భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొండపై నుంచి చూస్తే ఓ వైపు సముద్రం, మరోవైపు విశాఖ నగరం అందంగా కనిపిస్తాయి. శరన్నవరాత్రుల సమయంలో ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక పూజలు మొదలవుతాయి. రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. రోజూ సాయంత్రం 6 గంటల తర్వాత సప్త నేత్ర హరతి ఇస్తారు. ‘విజయ దశమి’ తర్వాత ఏకాదశి రోజున విశాఖ పోర్టు అనుమతితో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బోటుపై తీసుకెళ్లి సముద్రంలో తెప్పొత్సవాన్ని నిర్వహిస్తారు.