పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం ఓ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు చనిపోగా, పలువురు గాయపడ్డారు.వీరిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (GMPL)కు చెందిన గనిలో బొగ్గు వెలికి తీసేందుకు బాంబులు పెడుతుండగా ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.
పేలుడు శబ్దంతో పరుగులు కార్మికులు పరుగులు తీశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అక్కడే చిక్కుకున్న పలువురు కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. పేలుడు ధాటికి బొగ్గు గని సమీపంలోని పార్కింగ్ వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సైతం సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకూ 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.