రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికల తయారీకి కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించింది. దీనిపై సీఎం చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. స్వయం ఉపాధి మొదలుకుని.. బీసీలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటునివ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చి(ఐసీఎ్‌సఎ్‌సఆర్), టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సె్‌స (టీఐఎ్‌సఎస్), సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ(సీఎ్‌సడీఎస్), హైదరాబాద్‌కు చెందిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవల్‌పమెంట్ (సీఎ్‌సడీ)లను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు.
తద్వారా ఏటా మూడు లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్నారు! జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సర్వేకు పూనుకుంది. బీసీ జనాభాలో అర్హులకు వివిధ పథకాల కింద ఈ ఫలాలు అందే విధంగా పకడ్బందీ చర్యలకు ఆదేశించింది. అసలు బీసీలకు సంబంధించిన 139 కులాలవారు ప్రస్తుతం ఏ వృత్తుల్లో ఉన్నారు? అన్ని కులాలకూ కుల వృత్తులున్నాయా?, ఉంటే ఎంత శాతం మంది సంప్రదాయ వృత్తులు అవలంబిస్తున్నారు?, ఏయే కులాల్లో ఎంత శాతం మంది ఏయే వృత్తుల్లో ఉన్నారు?.. వారి అవసరాలేమిటి?.. ఆర్థికంగా, ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారమందిస్తే వారు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారు? ఈ అంశాలన్నింటిపైనా అత్యుత్తమ సంస్థలతో అధ్యయనం చేయించాలి.. ఇలా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఐసీఎ్‌సఎ్‌సఆర్, టీఐఎ్‌సఎస్, సీఎ్‌సడీఎస్, సీఎ్‌సడీలను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మెరుగైన సర్వే నిర్వహించగలిగిన సంస్థను ఎంపిక చేసి మన దగ్గర ఉన్న పల్స్‌సర్వే డేటా, బీసీల జనాభాకు సంబంధించిన వివరాలను క్రోడీకరించి సమగ్రమైన డేటాను రూపొందిస్తారు. వచ్చే మూడు నెలల్లో ఈ అధ్యయన ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత బీసీ సంక్షేమశాఖ బీసీలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉపయోగమో? గుర్తించి ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం(ఓబీఎంఎంఎస్) విధానం ద్వారా రుణాలు అందించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి పథకాలకు ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లతో యూనిట్లు అందించాలని హామీ ఇచ్చింది. ఈ నిధులను బీసీలకు అందించి వారి స్వయం సమృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించాలని బీసీ సంక్షేమాధికారులను చంద్రబాబునాయుడు ఆదేశించడంతో దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు అధ్యయన సంస్థలను సంప్రదించారు.