కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదిలేసినప్పటి నుంచి జనంలో తిరుగుతున్న ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ.. సామాన్యుల వద్దకు వెళ్లి ముచ్చటిస్తు్న్నారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత కూడా ఏదో ఒక చోట సామాన్య ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు, రోజువారీ కూలీలు, మెకానిక్‌లు, గిగ్ వర్కర్లతో మాట్లాడుతూ వారు పడుతున్న అవస్థలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇటీవల ఓ చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లి చెప్పులు కుట్టిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత అతడికి చెప్పులు కుట్టే మెషీన్‌ను అందించారు. తాజాగా ఓ దళితుడి ఇంటికి వెళ్లి వంట చేసి.. వారితో కలిసి తిన్నారు.
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జాతీయ పార్టీల అగ్రనేతల చూపు మొత్తం ప్రస్తుతం ఆ రాష్ట్రంపైనే పడింది. ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు మహారాష్ట్రలో పర్యటించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రకు వెళ్లారు. ఈ సందర్భంగా కొల్హాపూర్‌లోని ఓ దళిత కుటుంబంతో కొద్దిసేపు గడిపారు. దళితుడి ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ.. ఆ కుటుంబంతో కలిసి వంట చేశారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలు మాట్లాడారు. వంట చేయడం పూర్తి అయిన తర్వాత ఆ దళితుడి కుటుంబంతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కొల్హాపూర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే అనే దళిత దంపతుల ఇంటికి వెళ్లారు. దళితుల వంటగది గురించి ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని రాహుల్ గాంధీ తెలిపారు. కులవివక్ష అనే అంశంపై ఆ కుటుంబంతో మాట్లాడారు. ఇక షాహూ పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
"దళితులు ఏం తింటారు? ఎలా వండుతారు? దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాలు తెలుసుకునేందుకు నేను అజయ్ తుకారాం సనాదే కుటుంబంతో ఒక పూట గడిపాను" అని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక అజయ్ తుకారాం, అంజనా తుకారం దంపతులు.. తనను వారి ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానించారని.. ఆ తర్వాత వంటగదిలో వారికి సహాయం చేసే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత వారితో కలిసి బెండకాయతో ‘హర్భయాచి భాజీ’ పచ్చిమిర్చి, తువర్ పప్పు వండామని.. అనంతరం అంతా కలిసి తిన్నట్లు చెప్పారు.