ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వచ్చారు. లావోస్‌లో జరగనున్న 21వ ఆసియాన్ ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సులలో ప్రధాని మోదీ పాల్గొంటారు.లావోస్ పర్యటన ఆసియాన్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తన పర్యటన సంద్భంగా మోదీ అన్నారు.లావోస్ చేరుకున్న ప్రధాని మోదీకి స్థానిక డబుల్ ట్రీ హోటల్‌లో ప్రవాసభారతీయులు ఘనస్వాగతం పలికారు. ప్రవాస భారతీయులను ముఖ్యంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. స్థానిక ప్రవాస భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీకి జాతీయజెండాలు, కళాకృతులు అందజేశారు. అనంతరం స్థానిక యువకులతో కలిసి ప్రధాని మోదీ గాయత్రీ మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. బౌద్ధ భిక్షువులతో కలిసి ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. స్థానిక కళాకారిణుల సంప్రదాయ నృత్యాలను వీక్షించిన ప్రధాని వారిని అభినందించారు.లావోస్ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను
ప్రధాని తిలకించారు.పీపుల్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్ ప్రధాని ఆహ్వానం మేరకు రెండు రోజుల లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చారు. సాంస్కృతిక ప్రదేశాల పునరుద్ధరణ, విద్యుత్ ప్రాజెక్టులతో పాటు, మయన్మార్‌లో కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రధాని మోదీ లావోస్ ప్రధాని సొనెక్సా సిఫనాడోస్‌తో చర్చించనున్నారు.