ఆశ్వయుజ శుద్ధ అష్టమి, నవమి, శుక్రవారము, ది. 11-10-2024
అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదినీ నందినుతే
గిరివరవింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే ||
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ॥
ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు తొమ్మిదవ అలంకారంగా మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే తెల్లవారుజామునుంచి పడుతున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దూర బారాల నుండి భవానీలు ఇంద్రకీలాద్రికి కాలినడకన వస్తున్నారు.దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా ముల్లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని.. అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం మీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమలక్ష్యం. ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈరోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం పాయసాన్నం, రవ్వతో చేసి చక్కెర పొంగలి సమర్పిస్తారు.