ఏపీలో ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి భారీ ఊరట లభించింది. ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గీని బ్యాన్ చేయాలన్న నిర్ణయాన్ని ఏపీ హోటల్స్ అసోసియేషన్ విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే స్విగ్గీ యాజమాన్యం గురువారం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఇందులో భాగంగా ముఖ్యంగా 12 అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్చల సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ విధించిన షరతులకు స్విగ్గీ యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దాంతో ఏపీలో స్విగ్గీని బాయ్‌కాట్ చేయలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ స్వామి, కన్వీనర్ రమణరావు తెలిపారు. కాగా, స్విగ్గీ గత కొంతకాలంగా తమకు నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతోందని, అందుకే ఈ నెల 14 నుంచి ఏపీలో స్విగ్గీని బ్యాన్ చేయాలనుకుంటున్నామని హోటల్స్ అసోసియేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అలాగే నవంబర్ 1 నుంచి స్విగ్గీతో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి వస్తాయని హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.