విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి వేడుకలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో చివరి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఉత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను రద్దు చేశారు. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కనకదుర్గమ్మ హంస వాహనసేవను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే అమ్మవారి జలవిహారం రద్దు కావటంతో ప్రభుత్వం ఇతరత్రా ఏర్పాట్లపైనా దృష్టి పెట్టింది. అందులో భాగంగా దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు చేపట్టారు.
అయితే హంసవాహన సేవలో భాగంగా దుర్గమ్మ హంస వాహనంలో.. కృష్ణా నదిలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఈ సేవను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో విజయవాడ వస్తుంటారు. అయితే నీటి ప్రవాహం కారణంగా ఈ ఏడాది హంసవాహన సేవ రద్దు అయ్యింది. మరోవైపు అక్టోబర్ మూడో తేదీ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇన్నిరోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులను కటాక్షిస్తూ వచ్చారు. శుక్రవారం మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ.. శనివారం శ్రీరాజరాజేశ్వరిదేవీగా కనిపించనున్నారు.
మరోవైపు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు భారీసంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అధికారులు కొండ దిగువున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల దగ్గర నుంచి, అన్న ప్రసాదాల వితరణ వరకూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అదికారులు, ప్రభుత్వ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.