ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే చంద్రన్న బీమా పథకాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. అయితే కుటుంబ పెద్దకు మాత్రమే కాకుండా ఇంట్లోని అందరినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చంద్రన్న బీమా పథకం కిందకు రాష్ట్రంలోని పేదలను అందరినీ తీసుకువచ్చేలా కసరత్తు జరుపుతోంది.
ఏపీలో దారిద్ర్యరేఖకు దిగువన 1.21 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో సుమారుగా 3.07 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం కలిగేలా చంద్రన్న బీమా పథకాన్ని తేవాలని అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. చంద్రన్న బీమా పథకం అమలులో విధివిధానాల రూపకల్పన కోసం ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిటీ 18 నుంచి 70 ఏళ్లలోపు ఉన్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు, సహజంగా చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ కమిటీ సభ్యులు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో సీఎం చంద్రబాబు మార్పులు చేర్పులు చేసిన తర్వాత అమలు చేయనున్నారు.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా పథకం అమలు చేశారు. ఈ పథకం కింద క్లైయిమ్ చేసిన 15 రోజుల్లోగా బీమా సొమ్ము బాధిత కుటుంబాలకు అందజేస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. అయితే చాలా చోట్ల ఈ క్లెయిమ్‌లు భారీగా పెండింగ్ పడ్డాయి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈ వైఎస్ఆర్ బీమా పథకం పేరును మార్చింది. గతంలో 2014లో టీడీపీ హయాంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకం పేరును మళ్లీ పునరుద్ధరించారు. ఇప్పుడు మరింత మెరుగైన ప్రయోజనాలు అందించేలా, బీమా మొత్తాన్ని పెంచి చంద్రన్న బీమా పథకం అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక ఈ పథకం అమలు కోసం ఏడాదికి రూ.2800 కోట్లు అవసరమవుతాయని అంచనా. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే బీమా పథకాలకు చంద్రన్న బీమాను అనుసంధానించే విషయంపైనా చర్చ జరుగుతోంది.