ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రీల్స్ చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెట్టారని దివ్వెల మాధురి ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తిరుమలలో తాను ఎలాంటి తప్పూ చేయలేదన్న దివ్వెల మాధురి.. చేయని తప్పునకు ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని తెగేసి చెప్పారు. ఓ కార్యకర్తగా దువ్వాడతో కలసి తిరుమల వెళ్లానన్న దివ్వెల మాధురి.. తమతో పాటుగా మరికొందరు కార్యకర్తలు కూడా వచ్చినట్లు తెలిపారు. మమ్మల్ని ప్రశ్నించేవారు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ప్రశ్నించరు అంటూ మాధురి నిలదీశారు.
మరోవైపు తిరుమలలో తాము ఎలాంటి తప్పూ చేయలేదని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు చెప్పారు. పోలీస్ కేసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరోవైపు అక్టోబర్ ఏడో తేదీన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దివ్వెల మాధురి శ్రీవారి ఆలయం వెలుపల, పుష్కరిణి ప్రాంతాల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు రావటంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రీల్స్ చేయడంతో పాటుగా దివ్వెల మాధురి.. తాము సహజీవనం చేస్తున్నామంటూ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకున్నారని.. తిరుమలలో ఈ వ్యాఖ్యల ద్వారా హిందువుల మనోభావాలను దివ్వెల మాధురి దెబ్బతీశారంటూ టీటీడీ ఏవీఎస్‌వో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వెల మాధురి తిరుమలకు వెళ్లటంతో.. వారి పెళ్లి జరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దివ్వెల మాధురి ఖండించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చాకే తాము పెళ్లి చేసుకుంటామని.. అప్పటి వరకూ కలిసే ఉంటామన్నారు.