ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ ఉంటాం.. ఉన్నట్టుండి ఫోన్ కట్ అవుతుంది. దూరంగా ఉన్న కుటుంబసభ్యులను వీడియో కాల్ ద్వారా చూద్దామనుకుంటాం.. ఫోన్‌లో ఇంటర్నెట్ రాదు. ఇలాంటి సమస్యలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో ఇవి మరింతగా ఎక్కువయ్యాయి కూడా. సెల్‌ఫోన్ సిగ్నళ్ల సమస్య ఈ మధ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతానికి కూడా 4జీ సిగ్నల్ అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్తగా సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలతో పాటుగా మారుమూల గ్రామాలకు సైతం సెల్‌ఫోన్ సిగ్నళ్లు అందేలా కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,305 చోట్ల కొత్తగా 4జీ సెల్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి కూడా. బీఎస్ఎన్ఎల్ సంస్థతో పాటుగా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా 4జీ సెల్ టవర్ల ఏర్పాటు కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. మొత్తం 2,305 4జీ టవర్ల ఏర్పాటు పూర్తి అయితే రాష్ట్రంలోని 5,423 మారుమూల గ్రామాలకు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తాయి. 2305 సెల్ టవర్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 2271 చోట్ల స్థలాన్ని సైతం గుర్తించారు. ఈ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం.. టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్‌కు సైతం అందజేసింది. మిగిలిన వాటిని కూడా త్వరలోనే స్వాధీనం చేయనున్నారు.
4జీ సెల్ టవర్ల ఏర్పాటుతో పాటుగా 5జీ నెట్వర్క్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 5జీ స్మాల్ సెల్స్ ఆన్ స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటుపైనా పరిశీలన జరుపుతున్నారు. మొత్తంగా మారుమూల గ్రామాల్లోకి సైతం 4జీ సేవలు తీసుకెళ్లి.. ఆయా గ్రామాల్లో సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్, ఇంటర్నెట్ అనేవి మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యంగా మారిపోయాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు పెరుగతాయని ప్రభుత్వం భావన. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్‌ఎల్‌తో కలిసి 4జీ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తోంది.