ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ నోరుజారిన ట్రంప్.. అధికారంలోకి వస్తే భారత్‌కు షాక్ ఇస్తానని వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 11:13 PM

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ పట్ల కఠిన వైఖరి అనుసరించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత ఎన్నికలకు ముందు భారత్‌ పట్ల సానుకూల వైఖరిని అనుసరిస్తున్నట్లు వ్యవహరించారు. అయితే తాజాగా మళ్లీ తన పాత రూపాన్ని బయటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే భారత్ విషయంలో మరోసారి నోరు జారారు. ఇటీవలె ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన ట్రంప్.. రెండు రోజుల్లోనే భారత్‌ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా తయారు చేసిన వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్యాక్స్ వేస్తానని తేల్చి చెప్పారు.


అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తోందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై చైనా 200 శాతం ట్యాక్స్ విధిస్తోందని.. బ్రెజిల్‌లో టారిఫ్‌లు కూడా ఈ రకంగానే ఉన్నాయని ట్రంప్‌ వెల్లడించారు.


అమెరికాను మళ్లీ తిరుగులేని శక్తిగా, సుసంపన్నంగా చేయాలన్న తన లక్ష్యంలోని అతి ముఖ్యమైన అంశం ఇతర దేశాలతో పరస్పర ప్రయోజనం కోసం వస్తువులను మార్పిడి చేసుకోవడం అని తెలిపారు. సాధారణంగా అమెరికా ఎలాంటి పన్నులు వసూలు చేయదని.. అందుకే తన ప్రణాళికలో ఇది చాలా ముఖ్యమైన అంశమని తెలిపారు. తాను ఈ పరస్పర ప్రయోజనాల కోసం వస్తువులను మార్పిడి చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టినట్లు చెప్పిన ట్రంప్.. చైనా, బ్రెజిల్‌లు అమెరికా దిగుమతులపై 200 శాతం పన్నులు వసూలు చేస్తుండగా.. ఇక ఇంతకంటే ఎక్కువగా భారత్‌ అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తోందని పేర్కొన్నారు.


అయితే భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ మోదీ గొప్ప నాయకుడని.. గొప్ప వ్యక్తి అంటూ మంచిగా మాట్లాడుతూనే ట్యాక్స్‌ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇక అమెరికాలో ఇంధన ధరల పెరుగుదల గురించి ట్విటర్ వేదికగా ట్రంప్ స్పందించారు. వచ్చే ఏడాది లోపు ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ధరలను సగానికి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని.. ఇలాంటి చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని రాసుకొచ్చారు.


గతంలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌ను ఆయన టారిఫ్‌ కింగ్‌ అని అభివర్ణించడం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌కు జీఎస్‌పీ(జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌)ని రద్దు చేశారు. ఈ హోదా ఉంటే కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలాంటి ట్యాక్స్‌లు లేకుండా అమెరికాకు ఎగుమతులు చేయడానికి వీలుంటుంది. ఈ జీఎస్‌పీ ఉండటం వల్ల భారత్-అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు సమానంగా, హేతుబద్ధంగా లేవని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులకు భారత్‌ 200 శాతం పన్నులు వసూలు చేస్తుంటే.. అమెరికా మాత్రం భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా అంటూ ప్రశ్నించిన ట్రంప్.. మనం పన్నులు కడితే.. వారి నుంచి కూడా వసూలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించి అధికారాన్ని అప్పగిస్తే.. భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని గతంలోనే ట్రంప్‌ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com