ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో ట్వీట్ కలకలంరేపింది. ఏపీ సీఎంకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఈ నెల 4న తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రబాబు సీఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించడం దేవుడికి కూడా ఇష్టం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు కచ్చితంగా ప్రాణహాని ఉందని చైతన్య పేరతో ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించే వీడియో ట్వీట్ చేయడం కలకలంరేపింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న వీడియోను ట్వీట్ చేయడంతో టీటీడీ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. తిరుమల వన్ టౌన్ లో ఈ ట్వీట్‌పై ఫిర్యాదు చేశారు.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Blind Mannn అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న వీడియోని ట్వీట్ చేసి.. దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది.. మళ్లీ చెప్తున్నా ప్రాణగండం ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన Blind Mannn అకౌంట్ నిర్వహకుడు చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చైతన్యతో పాటుగా మరికొందరిపై వన్ టౌన్ పోలీసులు 196, 298, 299, 353(2) r/w BNS సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 4న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి ముందగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం దగ్గరకు వెళ్లగా.. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.