ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను వల్ల పెద్దఎత్తున నష్టం వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలపాటు అలర్ట్‌గా ఉంటూ ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, కాలువ గట్లకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బలహీనంగా ఉన్న గట్లను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులను అప్రమత్తం చేయాలని, ఎవరూ వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. పిడుగులు పడి, వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లకుండా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.