ఏపీలో సంచలనంరేపిన హిందూపురం అత్త, కోడలిపై అత్యాచారం కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.. వీరిని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఈ నలుగుర్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. నిందితుల అరెస్ట్‌పై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో అత్త, కోడలిపై అత్యాచారం జరిగింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి కోసం ఆ ఊరికి వచ్చారు. ఓ నిర్మాణం దగ్గర వీరు వాచ్‌మెన్‌తో పాటుగా ఇతర పనులు చేస్తున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి.. ఆ నిర్మాణం దగ్గర నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు.. అడ్డుపడిన తండ్రి, కొడుకును కూడా బెదిరించారు.
పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వయంగా జిల్లా ఎస్పీ రత్న రంగంలోకి దిగారు. నేరు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. నిందితుల కోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి గాలించారు. తాజాగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా జిల్లా ఎస్పీ రత్నతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్న సీఎం.. నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. బాధితులకు అండగా నిలబడాలని అధికారులకు సూచించారు.