దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ్ బెంగాల్‌లోని డార్జిలింగ్ శుక్నా కంటోన్మెంట్‌లో జరిగిన వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. జవాన్లతో కలిసి ఆయన ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సైనికులు, వారి కుటుంబాలకు విజయ దశమి శుక్షాకాంక్షలు తెలిపారు. వారిలో ఒకడిగా దసరా వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అక్కడ రూ.2,236 కోట్లతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిర్మించిన 75 మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొరుగు దేశం చైనా, బంగ్లాదేశ్‌లకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ఎవరైనా తమను బెదిరించాలని చూస్తే ఎంతకైనా వెనుకాడబోమని రాజ్‌నాథ్ హెచ్చరించారు.
‘భారత్ ద్వేషంతో లేదా ధిక్కారంతో ఏ దేశంపైనా దాడి చేయదు. మా సమగ్రత.... సార్వభౌమత్వాన్ని ఎవరైనా అవమానించినప్పుడు లేదా హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు...మతం, సత్యం, మానవ విలువలకు వ్యతిరేకంగా దాడులు చేస్తే మాత్రమే మేము పోరాడతాం.. ఇది మాకు వారసత్వంగా వచ్చింది.. దానిని మేము కొనసాగిస్తున్నాం.. ఒకవేళ, మా ప్రయోజనాలకు ముప్పు ఏర్పడితే చూస్తూ కూర్చోం.. మేము పెద్ద అడుగు వేయడానికి వెనుకాడం. అవసరమైతే ఆయుధాలు, సామగ్రి పూర్తి శక్తితో ఉపయోగిస్తమనడానికి ఆయుధ పూజ స్పష్టమైన సూచన’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
రాజ్‌నాథ్ శనివారం ప్రారంభించిన 75 ప్రాజెక్టుల్లో 22 రహదారులు, 51 వంతెనలు కాగా... వీటిలో 19 జమ్మూ కశ్మీర్, 18 అరుణాచల్ ప్రదేశ్, 11 లడఖ్, 9 ఉత్తరాఖండ్, ఆరు సిక్కిమ్, ఐదు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్‌లో రెండేసి, నాగాలాండ్, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. రాజ్‌నాథ్ శనివారం ప్రారంభించిన వాటిలో సిక్కిమ్‌లోని వ్యూహాత్మక కుపుప్-షెర్తాంగ్ రహదారి ఉంది. ఇది జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్, జులుక్స్‌ను అనుసంధానం చేస్తుంది.
‘ఆయుధ పూజను ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకొనే కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. మన ఆరాధ్యదైవాలను పూజించేటప్పుడు శస్త్రపూజ చేయడం మన సంప్రదాయం. దేశంలోని ఆయా వృతులవారు అంతా ఏడాదికి ఒకసారి తమ పనిముట్లను పూజించడం మనం చూస్తుంటాం. దీపావళి, వసంత పంచమి రోజున విద్యార్థులు పెన్నులు, పుస్తకాలకు.. సంగీత విద్వాంసులు తమ వాయిద్యాలకు పూజలు చేస్తారు. దేశంలోని అనేక కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. శస్త్రపూజ అంటే కేవలం వాటిని పూజించడమే కాదు, పని పట్ల మనకున్న గౌరవాన్ని చాటుకోవడం కూడా’ అని రాజ్‌నాథ్ అన్నారు.
ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రక్షణ మంత్రి అన్నారు. ఇది కేవల చెడుపై మంచి గెలుపే కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు. శ్రీరాముని లక్షణాలు మన జవాన్లలో తాను చూశానని, ఈ రోజు వరకూ మన సంస్కృతిని అవమానించినప్పుడు మాత్రమే భారతదేశం ఇతర దేశాలపై దాడి జరిపిందని, విద్వేషం కారణంగా ఎన్నడూ దాడులు చేయలేదని అన్నారు.