వచ్చె నెలలోనే మండల- మకర విలక్కు పూజల సీజన్ కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో దర్శనాల విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలో దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.
ఈ మార్పుల వల్ల అయ్యప్ప దర్శనాలకు రోజూ 17 గంటల పాటు సమయం కేటాయించినట్టు అవుతుందని ఎస్.ప్రశాంత్ పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ ప్రారంభమై డిసెంబరు 26 వరకు కొనసాగనున్నాయి. తర్వాత రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి.. మళ్లీ డిసెంబరు 30 నుంచి మకరు విలక్కు పూజల కోసం తెరుస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనం.. జనవరి 20న పడిపూజతో మకరు విలక్కు సీజన్ ముగియనుంది.
ఈ నేపథ్యంలో శబరిమలకు వచ్చే భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్‌ను కేరళ సర్కార్ తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్పాట్ బుకింగ్ ఉండబోవని పేర్కొంది. కేవలం వర్చువల్ క్యూ మాత్రమే అమలు చేసి, ఆన్ లైన్ బుకింగ్స్ చేసే వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
దీనిపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ఈ ఏడాది స్పాట్ బుకింగ్‌లు లేవని, కేవలం వర్చువల్ క్యూ మాత్రమే ఉంటుందని చెప్పారు. ఏ భక్తుడూ స్వామిని దర్శించుకోకుండా తిరిగి వెళ్లరాదనే సదుద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ‘స్పాట్ బుకింగ్ కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే.. వర్చువల్ క్యూ బుకింగ్ అనేది భక్తులకు ప్రామాణికమైన పత్రం. స్పాట్ బుకింగ్స్ పెరగడం మంచిది కాదు. స్పాట్ బుకింగ్ ఉంటే ఎవరైనా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తారా? భక్తుల భద్రతతో పాటు ఆలయ భద్రత కూడా బోర్డుకు ముఖ్యం.
ఆదాయం గురించే ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం లేదు. అయ్యప్ప భక్తులు ప్రస్తుతం వివిధ మార్గాల్లో శబరిమలకు చేరుకుంటున్నారు. వారికి ప్రామాణికమైన పత్రం అవసరం. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోని భక్తుల సంఖ్య పెరిగితే ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం.. మండల-మకరు విలక్కు సీజన్‌కు సంబంధించిన 90% పనులు పూర్తయ్యాయి’ అని చెప్పారు. గతేడాది ఊహించని విధంగా భక్తులు రాక.. అందుకు తగ్గ ఏర్పాట్లు లేకపోవడంతో స్వామి దర్శనాలు లేకుండానే వెనుదిరిగిన పరిస్థితి. ఈ విషయంలో కేరళ సర్కారు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.