పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులు యుద్ధ భయాన్ని రేకెత్తిస్తున్నారు. ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌పై ఇజ్రాయేల్ భారీ ఎత్తున శనివారం సైబర్ దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రభుత్వంలోని మూడు విభాగాల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక) సేవలకు అంతరాయం ఏర్పడింది.. వీటితో పాటు అణుస్థావరాలే లక్ష్యంగానూ ఈ దాడులు జరిగాయని, దీని ఫలితంగా సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్‌స్పేస్ విభాగం మాజీ సెక్రటరీని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా కథనాలు వెలువరించింది.
‘మా అణుస్థావరాలపై సైబర్ దాడులు జరిగాయి.. ఇంధనం సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్కులు ఇలా పెద్ద జాబితానే ఉంది’’ అని ఆయన వెల్లడించారు. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్‌పై ఇజ్రాయేల్ (Israel) భీకర దాడులతో విరుచుకుపడుతుండగా.. ఇరాన్ సైతం ఈ యుద్ధంలోకి ప్రవేశించిన చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయేల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడిలో ఇరాన్ ప్రత్యక్షంగా పాల్గొంది. అక్టోబరు 1న జరిగిన ఈ దాడికి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రతిజ్ఞ చేసింది.
ఇరాన్ చమురు, అణు స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయేల్ దాడులు చేస్తుందా..? అనే ఆందోళనల మధ్య ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నెతన్యాహుకు సూచించారు. ఈ క్రమంలోనే సైబర్ దాడులు జరగడం గమనార్హం. అటు, అమెరికా సైతం ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై ఆంక్షలను విస్తరించింది. ఇరాన్ ఆర్ధిక సామర్ధ్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయేల్‌కు సాయం చేయడానికి తమ భూబాగాన్ని లేదా గగనతలాన్ని వినియోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు ఉత్పత్తి చేస్తోన్న గల్ఫ్ దేశాలకు దౌత్యవేత్తల ద్వారా ఈ హెచ్చరికలను పంపినట్టు పేర్కొంది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం. ‘అమెరికా మిత్ర దేశాలు తమ సైనిక అవస్థాపన లేదా గగనతలాన్ని ఇరాన్‌కు వ్యతిరేకంగా దాడులకు అనుమతించడం ద్వారా సంఘర్షణను మరింత విస్తృత చేయడానికి సిద్ధంగా లేమని బైడెన్ యంత్రాగానికి తెలియజేశాయి. ఈ గల్ఫ్ దేశాలు తమ చమురు కేంద్రాలు.. సాంప్రదాయకంగా అమెరికా రక్షణలో ఉన్నందున, సంఘర్షణ పెరిగితే ప్రధాన లక్ష్యాలుగా మారవచ్చని భయపడుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమెరికా దళాలలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన పశ్చిమాసియాలో యుద్ధం అనివార్యమైతే ఆ దళాలను కూడా గణనీయమైన ప్రమాదానికి గురి చేస్తుంది.