కంచిలి పరిధిలోని అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పులి అరుణ కుమారి(27) కుటుంబ కలహాలతో శనివారం రాత్రి ఒంటిపై డీజిల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సోంపేట సీఐ మంగరాజు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరుణకుమారికి భర్త లక్ష్మీనారాయణకు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. లక్ష్మీనారాయణ ఇచ్ఛాపురం బోర్డర్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసై ప్రతీరోజు భార్యతో గొడవలు పడుతుండేవాడు. తాగి రావడమే కాకుండా కొట్టడం, పుట్టింటికి వెళ్లిపోమనడం చేస్తుండేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి, కొట్టడడం కన్నవారింటికి వెళ్లిపోమన్నాడు.
దీంతో మనస్తాపానికి గురై రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న డీజల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈమెకు భర్త లక్ష్మీనారాయణ తోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై సోంపేట సీఐ బి.మంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంకేసీజీలో పంచనామా నిర్వహించిన తర్వాత తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.