కంచిలి పరిధిలోని కొత్త అంపురం గ్రామానికి చెందిన మద్ది త్రినాథ్(12) అనే బాలుడు శనివారం ఉదయం ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని చెరువులో జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మద్ది నీలయ్య కుమారుడు త్రినాథ్ దసరా సందర్భంగా తన సైకిల్‌ను కడిగేందుకు శనివారం ఉదయం పక్కనే ఉన్న చెరువుకు వెళ్లాడు. సైకిల్‌ను గట్టుపై ఉంచి బకెట్‌తో నీరు తెచ్చి, సైకిల్‌ను కడుగుతున్నాడు.
ఈ క్రమంలో చెరువులో జారిపడి మునిగిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్థులు వెంటనే చెరువులో దిగి త్రినాథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. నీటిలో మునిగిపోయిన బాలుడిని ఒడ్డుకు తెచ్చేసరికి అపస్మారక స్థితిలోకి చేరాడు. వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి, అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పండుగంటి రోజున త్రినాథ్ అకాల మరణంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై బాలుడి తండ్రి నీలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రామచంద్రారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.