ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. జైల్లో నుంచే పక్కాగా హత్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 10:06 PM

 మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. జైలు నుంచే తన గ్యాంగ్‌ను నడిపిస్తూ.. క్రిమినల్‌ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న లారెన్స్ బిష్ణోయ్.. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ను వణికిస్తున్నాడు. ఓవైపు లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లో ఉండగా.. అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి అతడి గ్యాంగ్‌ను నడిపించడం, ఇక్కడ హత్యలు చేయించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామానికి చెందిన సంపన్న కుటుంబంలో లారెన్స్ బిష్ణోయ్ 1993లో జన్మించాడు. రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో బిష్ణోయ్ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. పంజాబ్‌ యూనివర్సిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో లా కోర్సు పూర్తి చేసిన లారెన్స్ బిష్ణోయ్.. నేషనల్ లెవల్ అథ్లెట్‌గా, పంజాబ్‌ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌గా ఉన్నాడు. అదే సమయంలో గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడగా.. కొన్ని రోజులకు అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించారు. విద్యార్థి రాజకీయాల ముసుగులో వీరిద్దరూ నేరాలవైపు అడుగులు వేశారు. ఇక డీఏవీ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో లారెన్స్ బిష్ణోయ్ లవర్‌ను.. ప్రత్యర్థులు సజీవ దహనం చేయడంతో అతడు పూర్తిగా గ్యాంగ్‌స్టర్‌గా మారినట్లు తెలుస్తోంది.


ఇక 2018లో సంపత్‌ నెహ్రాతో కలిసి సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర చేయడంతో లారెన్స్ బిష్ణోయ్.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో ప్రొఫెషనల్‌ షూటర్లు ఉండగా.. వీరి నెట్‌వర్క్‌ దేశంలోని 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇక లారెన్స్‌ బిష్ణోయ్‌ని చంపేందుకు ఇప్పటికీ ఢిల్లీలోని పలువురు గ్యాంగ్‌స్టర్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్‌పై వివిధ కేసుల్లో కోర్టులకు తరలించడం పోలీసులకు తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ సబర్మతి జైల్లో ఉన్నా.. అతడి గ్యాంగ్‌ మాత్రం బయట పనిచేస్తూనే ఉంది. లారెన్స్ సోదరుడు అన్మోల్‌, ఫ్రెండ్ గోల్డీ బ్రార్‌లు కెనడా నుంచి గ్యాంగ్ వ్యవహారాలు మొత్తం చూసుకుంటున్నారు.


ఇక గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. లారెన్స్‌ బిష్ణోయ్ సన్నిహితుడు జస్విందర్‌ను గ్యాంగ్‌స్టర్‌ జైపాల్‌ భుల్లర్‌ హతమార్చాడు. అయితే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పంజాబ్‌లోని భరత్‌పుర్‌లో విస్తరించడానికి జస్విందర్‌ పనిచేయడం గమనార్హం. సిద్ధూ మూసేవాలా హత్యకు కూడా ఈ ముఠా తగాదాలే కారణం. విక్కీ మిదుఖేడా మరణానికి ప్రతీకారంగా సిద్ధూ మూసేవాలాను లారెన్స్‌ బిష్ణోయ్ అనుచరులు కాల్చిచంపారు. ఇక ఈ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సీమాంతర ఆయుధ స్మగ్లింగ్‌, డ్రగ్స్ రవాణాకు కూడా పాల్పడుతోందని గుజరాత్‌ ఏటీఎస్‌ పేర్కొంది.


గత కొన్నేళ్లుగా లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లోనే ఉంటున్నాడు. అయితే జైలులోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా నిత్యం తన అనుచరులతో టచ్‌లో ఉంటాడని తెలుస్తోంది. పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసుకుని వారిని హత్య చేస్తే తమ గ్యాంగ్ పేరు బాగా వినిపిస్తోందని లారెన్స్ బిష్ణోయ్ ఆలోచన. పేరు మాత్రమే కాకుండా తమ ప్రత్యర్థి గ్యాంగ్‌లను కూడా బెదిరించేందుకు ఉపయోగపడతాయని భావిస్తాడు. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీల హత్యలతో ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే ఓ పెద్ద భయంకరమైన గ్యాంగ్‌గా ఈ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెచ్చుకుంది. ఇక బడా బిజినెస్‌మెన్‌లు, రాజకీయ నాయకుల నుంచి భారీగా వీళ్లు డబ్బులు వసూలు చేస్తారని సమాచారం. ఢిల్లీలోని అఫ్గాన్‌ పౌరుడైన నాదిర్‌ షా నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియాను తన చేతుల్లోకి తీసుకునేందుకు లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com