ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో మరోసారి కెనడా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని గతంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఏకంగా ఆ దేశ పార్లమెంటులోనే తీవ్ర ఆరోపణలు చేయడం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయగా.. తాజాగా భారత రాయబారిని ఏకంగా ఈ హత్య కేసులో అనుమానిత జాబితాలో చేర్చడం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఓట్ల కోసం జస్టిన్ ట్రూడో రాజకీయాలు చేస్తున్నారని.. మత ఛాందసవాదులకు ఆయన లొంగిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో విచారణ జరుపుతున్న కెనడా ప్రభుత్వం.. తాజాగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతోపాటు పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంది. ఈ విషయం కెనడా నుంచి అక్కడ ఉన్న భారత విదేశాంగ శాఖకు సమాచారం అందింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి చర్యలు సరికావని పేర్కొన్న భారత్.. ఓటు బ్యాంక్ రాజకీయాలతో నడిచే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. మత ఛాందసవాదులకు మద్దతుగా ఉందని మండిపడింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి గతేడాది.. కెనడా పార్లమెంటులో మాట్లాడిన జస్టిన్ ట్రూడో.. ఈ హత్య వెనుక భారత అధికారుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. వాటికి సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు ఆ దేశ ప్రభుత్వాన్ని అడిగినా.. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు భారత్‌కు ఇవ్వలేదని విదేశాంగశాఖ వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసమే, మత ఛాందసవాదులకు మద్దతు పలికేందుకే.. ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై విమర్శలు చేస్తోందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక 2018 నుంచే భారత్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు ఆధారాలున్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టే వారిని కెనడా మంత్రి వర్గంలో జస్టిన్ ట్రూడో చేర్చుకున్న విషయాన్ని భారత్ గుర్తు చేసింది. అంతేకాకుండా 2020లో భారత రాజకీయాల్లో జస్టిన్ ట్రూడో నేరుగా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని.. ఆయన వివిధ దేశాల్లో భారత ప్రతినిధిగా పనిచేశారని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
ఇక ఇటీవల ఆసియాన్ సమావేశాల సందర్భంగా లావోస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరు నేతలు ఎదురుపడ్డారని.. కానీ ఎలాంటి చర్చలు జరగలేదని భారత్ స్పష్టం చేసింది. కెనడా గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేవరకు.. భారత్-కెనడా మధ్య మునుపటిలా సత్సంబంధాలు నెలకొనడం కష్టమేనని అప్పట్లోనే విదేశాంగశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.