ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై బహిరంగంగా కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య తామే చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రకటించింది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేసినా.. ఇలాంటి పరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందనే హెచ్చరికలను బాబా సిద్ధిఖీ హత్యతో మరోసారి లారెన్స్ బిష్ణోయ్ ముఠా వెల్లడించింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. దేశంలో తీవ్ర అశాంతిని నెలకొల్పుతుండటంతో మరోసారి 90వ దశకంలో దేశాన్ని వణికించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుర్తుకు తెస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ కీలక విషయాలు వెల్లడించింది.
లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్‌స్టర్లపై యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీతో ఎన్ఐఏ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను పోల్చింది. చిన్న చిన్న నేరాలతో నెట్‌వర్క్‌ను విస్తరించిన దావూద్ ఇబ్రహీం.. లాగే లారెన్స్ బిష్ణోయ్ కూడా ఉగ్రవాద సిండికేట్‌గా పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. డ్రగ్స్ అక్రమ రవాణా, టార్గెట్ కిల్లింగ్స్, దోపిడీ రాకెట్ల ద్వారా దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను విస్తరించి.. ఆ తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి డీ-కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇక అదే రకంగా చిన్న చిన్న నేరాలతో మొదలైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని శాసిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇక ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను సత్వీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ ఆపరేట్ చేస్తున్నాడు. ఈ గోల్డీ బ్రార్.. కెనడా పోలీసులు, భారత నిఘా ఏజెన్సీల దృష్టిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్నాడు. ఇక ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది. వారిలో 300 మంది పంజాబ్‌తో సంబంధం ఉన్నవారు ఉన్నారని తెలిపింది. ఇక 2020-21 నాటికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. వివిధ రకాల అక్రమ మార్గాల ద్వారా కోట్లాది రూపాయలను కూడబెట్టి.. వాటిని హవాలా ద్వారా విదేశాలకు పంపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్‌ఐఏ ఛార్జిషీట్ ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు కేవలం పంజాబ్‌లోనే ఉండేది. లారెన్స్ బిష్ణోయ్ తన అత్యంత సన్నిహితుడు గోల్డీ బ్రార్ సాయంతో హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న చిన్న చిన్న ముఠాలతో కలిసి భారీ నెట్‌వర్క్‌ను సృష్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు చేస్తోంది. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలతో సహా ఉత్తర భారతదేశంలో విస్తరించింది.
యూత్‌ను గ్యాంగ్‌లోకి చేర్చుకునేందుకు ఈ బిష్ణోయ్ ముఠా.. సోషల్ మీడియాతోపాటు అనేక మార్గాలను ఎంచుకుంటోంది. ఇక లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఫోటోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు తీసిన లారెన్స్ బిష్ణోయ్ ఫోటోలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో తెగ హల్‌చల్ చేయడం వల్ల ఈ గ్యాంగ్‌లో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతను ఇంకా గ్యాంగ్‌లో చేరేందుకు.. వారిని భారీగా ప్రలోభపెడుతున్నారు. యువతను కెనడాకు లేదా వారికి నచ్చిన దేశాలకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా.. పంజాబ్‌లో టార్గెట్ కిల్సింగ్స్, నేరాలు చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షూటర్లను రంగంలోకి దించుతున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.