బాలికలు, మహిళలు, వృద్ధులు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిత్యం జరిగే అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇక కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని యావత్ దేశం ప్రభుత్వాలకు నిత్యం సూచిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రజా ప్రతినిధులు.. ఇలాంటి ఘటనలపై స్పందిస్తూ చేసే వ్యాఖ్యలు ఒక్కసారి తీవ్ర దుమారానికి కారణం అవుతూ ఉంటాయి. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా మహిళలపై జరుగుతున్న ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిస్తూనే ఆయన చేసిన వ్యాఖ్యలు, చర్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మహిళలపై చేయి వేసేవారిని నరికేయాలని.. కత్తులు పంచడం ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది.
బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో విజయదశమి వేడుకల సందర్భంగా సీతామర్హి ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. విజయదశమి సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్.. అక్కడ ఉన్న బాలికలకు కత్తులు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులను అక్కడే నరికివేయాలని వారందరికీ సూచించారు. దీంతో ఎవరు కూడా ఆడపిల్లలను తాకడానికి కూడా ధైర్యం చేయలేరని వారికి చెప్పారు. సమాజంలో హింసను ప్రేరేపించేలా ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ చేసిన చేసిన ప్రసంగం, ఆయన కత్తులు పంపిణీ చేయడం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
సీతామర్హి జిల్లాలోని కప్రోల్ రోడ్‌లోని దుర్గా పూజా పండల్‌లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మిథిలేష్.. అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. “ఏ దుర్మార్గుడు అయినా మన సోదరీమణులను తాకడానికి ధైర్యం చేస్తే, అతని చేతిని ఈ కత్తితో నరికివేస్తాం. మా సోదరీమణులకు వారి చేతులు నరికివేయగల సామర్థ్యం ఉండాలి. అవసరమైతే, నేను, మీరందరూ ఈ పనిని చేయాల్సి ఉంటుంది. మా సోదరీమణులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందరినీ నాశనం చేయాలి ” అని బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ పేర్కొన్నారు.
మహిళలు, అమ్మాయిల పట్ల జరుగుతున్న దారుణాలను అడ్డుకునేందుకు.. తాను తీసుకున్న చొరవకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మిథిలేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకునేలా మహిళలను ఆయన ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే స్కూల్, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఆయన కత్తులు పంపిణీ చేశారు.