‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)’ పథకాన్ని 70 ఏళ్ల దాటిన వృద్ధులకు వర్తింప జేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ పథకంలో ఇప్పటికే చేర్చారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రెండు వారాలకు సరిపడే ఔషధాలు అందించడం, ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు చేయించుకున్న వ్యాధి నిర్థారణ పరీక్షల ఖర్చునూ పరిగణనలో తీసుకోవడం వంటివి ఈ పథకంలో ఉన్నాయి. ఆహారం, వసతితో సహా ఆసుపత్రి సేవలు లబ్ధిదారులకు ఉచితంగా అందుతాయి. పేద, ధనిక వర్గాలు తేడా లేకుండా 70 ఏళ్లు, ఆపై వయసు పైబడినవారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేయడంతో 4.5 కుటుంబాల్లోని 6 కోట్ల మందికి లబ్ది కలగనుంది.
‘ఈ పథకం కింద ఆరోగ్య-ప్రయోజన ప్యాకేజీలపై నిర్ణయం తీసుకునే కమిటీ మరిన్ని ప్యాకేజీలను జోడించాల్సిన అవసరం గురించి చర్చిస్తోంది.. ఇది ప్రత్యేకంగా వృద్ధాప్య సంరక్షణకు మొగ్గు చూపుతుంది.. ఈ పథకం ప్రారంభంతో అటువంటి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది’ అని అధికారులు తెలిపారు. అల్జీమర్స్, డెమెన్షియా వంటి కొన్ని మానసిక-ఆరోగ్య చికిత్సలు కూడా ప్రస్తుత పథకం కిందకు రానున్నాయి.
సెప్టెంబరు 1 వరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ మినహా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ కింద 12,696 ప్రయివేట్ ఆసుపత్రులు సహా 29,648 ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 7.37 కోట్ల మంది ఆసుపత్రుల్లో చేరారని.. వీరిలో 49 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ పథకం కింద రూ.లక్ష కోట్లకుపైగా ప్రజలు లబ్ధి పొందారని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. జనాభాలో 40 శాతంగా ఉన్న 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయని తెలిపింది.
కాగా, ఆయుష్మాన్ భారత్ పథకంలో అర్హులైన సీనియర్ సిటిజన్ల పేర్ల నమోదుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ పథకం ప్రయోజనం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ (Ayushman), వెబ్‌సైట్‌లో (Beneficiary.nha.gov.in) ప్రత్యేక విభాగం తీసుకొచ్చింది.