చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలు వెర్రితలలు వేస్తున్నాయి. వైయస్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా వరుస అక్రమ కేసులతో వారిని వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తోంది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి వాపోయారు. అయన మాట్లాడుతూ.... అందులో భాగంగానే.. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని వక్రీకరిస్తూ.. ఆ ఉదంతంతో ఎలాంటి సంబంధంలేని వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైయస్ఆర్‌సీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌లపై లుక్‌అవుట్ నోటీసు జారీచేయడమే ఇందుకు తాజా నిదర్శనం. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చీరాగానే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని అర్థరాత్రి బుల్డోజర్లతో కూల్చివేసింది. దీనిపై వైయస్ఆర్‌సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే మంజూరైంది.
అయినాసరే కూల్చివేతకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేశారు కాబట్టి. కానీ, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడలేని అత్యుత్సాహం చూపిస్తోంది. అప్పట్లో టీడీపీ నేత పట్టాభి నాటి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మనస్తాపం చెంది తీవ్రస్థాయిలో నిరసన తెలిపి ధర్నా చేశారు. ఈ ఘటనను వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు.