భార్యపై బలవంతంగా భర్త అత్యాచారానికి పాల్పడితే నేరం అవుతుందా? ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత చట్టాల్లో ఉన్న రాజ్యాంగబద్దమైన రక్షణపై నిర్ణయం తీసుకోనున్నట్లు కోర్టు పేర్కొన్నది.మైనర్ కాని భార్యను భర్త బలవంతంగా రేప్(Marital Rape) చేస్తే అతన్ని విచారించవచ్చా అన్న అంశంపై సుప్రీంలో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వాటిపై విచారణ చేపట్టింది. వివాహ బంధంలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే, అప్పుడు వివాహ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు కోర్టు అభిప్రాయపడింది.సీనియర్ న్యాయవాది కరుణా నందీ ఓ పిటీషనర్ తరపున వాదించారు. వైవాహిక అత్యాచారంపై ఐపీసీ, బీఎన్ఎస్‌లో ఉన్న చట్టాలను ఆమె కోర్టుకు వివరించారు. ఇది రాజ్యాంగబద్దమైన ప్రశ్న అని, తమ కన్నా ముందు రెండుసార్లు ఈ అంశంపై కోర్టు తీర్పులు వెలువరించిందని, శిక్షకు సంబంధించిన కీలకమైన అంశంపై మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీజే చంద్రచూడ్ తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఓ నియమాన్ని కొట్టిపారేయాలని కరుణా నందీ కోరారు. ఆ సమయంలో కోర్టు స్పందిస్తూ 18 ఏళ్లు దాటిన భార్యతో లైంగిక చర్యకు పాల్పడడాన్ని అత్యాచారంగా భావించలేమని పేర్కొన్నది. ఐపీసీలోని సెక్షన్ 375 నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఆ సెక్షన్ ప్రకారం మైనర్ కాని భార్యతో సెక్స్ చేయడం నేరం కాదు. కొత్తగా ప్రవేశపెట్టిన బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం కూడా మినహాయింపు ఉన్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఆ సెక్షన్ ప్రకారం కూడా భార్యతో సెక్స్ చేయడం నేరం కాదు అని కోర్టు తెలిపింది.
శృంగార కలయికకు భార్య వద్దంటే.. ముమ్మాటికీ వద్దు అనే అర్థం వస్తుందని సీనియర్ అడ్వకేట్ కోలిన్ గొంజాల్వేస్ తెలిపారు. రేప్, హింస.. పెళ్లి వ్యవస్థను దిగజార్చుతాయని ఆయన అన్నారు. ఏ వివాహ వ్యవస్థలో అయినా.. ఒకసారి వద్దు అంటే.. వద్దు అన్నట్లే లెక్క అని వెల్లడించారు. వైవాహిక అత్యాచారం కేసుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు భారత చట్టాలు లేవని గొంజాల్వేస్ తెలిపారు. వివాహ వ్యవస్థలో భార్య ఎప్పుడు లైంగిక చర్యకు అనుమతి ఇస్తుందో, ఎప్పుడు నిరాకరిస్తుందో, ఎలా తెలుస్తుందని జస్టిస్ పర్దివాలా ప్రశ్నించారు. అత్యాచారం నుంచి ఓ వివాహిత మహిళను రక్షించడం వల్ల వివాహ వ్యవస్థకు నష్టం కలుగదని, పెళ్లి అనేది వ్యక్తిగతమైందని, అది వ్యవస్థీకృతమైంది కాదు అని న్యాయవాది కరుణ పేర్కొన్నారు. దంపతుల మధ్య అనుమతి లేని శృంగార చర్యను నేరంగా భావిస్తే, అది సామాజిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తమ పిటీషన్‌లో కేంద్రం వాదించింది.సహజీవనం చేస్తున్న మహిళపై అనుమతి లేకుండా శృంగారం చేస్తే అది రేప్ అవుతుందని, మరి వివాహిత మహిళపై పదేపదే క్రూరమైన చర్యకు పాల్పడితే అది రేప్ ఎందుకు కాదు అని న్యాయవాది కరుణ ప్రశ్నించారు. మారిటల్ రేప్ సెక్షన్‌లో ఉన్న మినహాయింపు వల్ల.. సమానత్వ హక్కు, లింగ సమానత్వం, భావ స్వేచ్ఛను కోల్పోతున్నట్లు ఆమె తెలిపారు. బాధితురాలిని పెళ్లి చేసుకున్నంత మాత్రానా.. రేపిస్టు శిక్ష నుంచి అనర్హుడు కాదు అని ఆమె వాదించారు. మళ్లీ ఈ అంశంపై రేపు కోర్టులో వాదనలు జరగనున్నాయి.