ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరావళి వివాదంపై మళ్లీ సుప్రీంకోర్టుకు.. సీజేఐ, రాష్ట్రపతికి ఉద్యమకారుడు లేఖ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 08:34 PM

ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. కేంద్రం నిర్ణయంతో ఆరావళిలో జీవవైవిద్యం దెబ్బతింటుందనే ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఈ వివాదంపై పర్యావరణ ఉద్యమకారుడు, లాయర్ హితేంద్ర గాంధీ.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాసిన ఆయన.. స్థానిక భూభాగం కంటే 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భూస్వరూపాలను మాత్రమే ఇప్పుడు 'అరావళి'గా పరిగణించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఆయన పంపారు. ఎత్తు అధారిత ఒక సంకుచిత ప్రమాణం వాయువ్య భారతదేశం అంతటా పర్యావరణ పరిరక్షణను బలహీనపరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


స్థానిక భూభాగం కంటే 100 లేదా అంతకంటే ఎక్కువ మీటర్లు ఎత్తులో ఉన్న స్థానిక భూస్వరూపాలను మాత్రమే ‘ఆరావళి’గా పరిగణించాలని గత నెలలో సుప్రీంకోర్టు నిర్వచించింది. ఈ నిర్వచనంపై రాజకీయ నాయకులు, పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. దీనివల్ల మైనింగ్, రియల్ ఎస్టేట్ కబ్జాలు, కోలుకోలేని విధంగా పర్యావరణ విధ్వంసం వంటి అల్లకల్లోలాలు తలెత్తి ఆరావళి శ్రేణిలోని 90 శాతం వరకు రక్షణలు కోల్పోయే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎడారీకరణను వేగవంతం చేస్తుందని, భూగర్భ జలాల పునరుజ్జీవనాన్ని దెబ్బతీస్తుందని, ఇప్పటికే కాలుష్యం, యు నీటి కొరతతో బాధపడుతున్న ఈ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.


ఆరావళి వ్యవస్థను పర్యావరణపరంగా కీలకమైన సహజ కవచంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 20న ఇచ్చిన ఉత్తర్వులను ఒక ముఖ్యమైన, స్వాగతించదగిన చర్య అని గాంధీ తన లేఖలో అభివర్ణించారు. కానీ ఆరావళి పర్వతాలు , శ్రేణులను గుర్తించడానికి ప్రాథమిక ప్రమాణంగా స్థానిక పరిసరాల కంటే 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భూస్వరూపాలనే పరిగణించాలనే కార్యాచరణ నిర్వచనంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి నిర్దేశిత ఎత్తు పరిమితిని చేరుకోకపోవచ్చు కానీ క్రియాత్మకంగా కీలకంగా ఉంటాయని, ఈ విధానం పర్యావరణపరంగా ఆరావళి సమగ్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa