ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఆపీస్‌పై దాడి చేశారంటూ ఆయనపై అక్రమ కేసు పెట్టారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిన్న సజ్జలకు పోలీసులు నోటీసులు అందజేయడంతో ఇవాళ ఆయన పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.
ఆయన వెంట వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెళ్లగా, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును సుధాకర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, నాయకులు అవినాష్, నందిగం సురేష్‌లను పోలీసులు విచారించారు.