కాకినాడ జిల్లా తుని నుంచి తమిళ నాడుకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నాటుతుపాకీని సీజ్ చేశారు. తమిళనాడులోని చెన్నై పద్మనాభనగర్‌కు చెందిన రమేష్ వినేష్‌కుమార్, రాణిపర్తి జిల్లా మేళకుప్పం ప్రాంతానికి చెందిన కుమారన్ మరిమూర్తి స్నేహితులు. వారు చెన్నై నుంచి బుధవారం ఉదయం బయలుదేరి తునికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ముఠా వారికి తుని వద్ద గంజాయిని అందజేసింది. సరుకును చైన్నైకి తీసుకెళ్లి విక్రయించాలనుకున్నారు. దీనికి వారం ముందుగా వారు ఇదే స్కెచ్‌ను అమలు చేశారు. తుని నుంచి గంజాయిని తీసుకెళ్లి చెన్నైలో విక్రయించారు. విశాఖ ముఠా నుంచి రెండు కిలోల గంజాయిని రూ.9వేలకు కొనుగోలు చేశారు. దాన్ని చెన్నైలో రూ.20వేలకు విక్రయించారు.
వారం క్రితం వేసిన స్కెచ్ ఫలించడంతో బుధవారం ఉదయం అక్కడి నుంచి తునికి వచ్చారు. అక్కడ నుంచి గంజాయిని కారులో తరలిస్తుండగా సమాచారం రావడంతో పటమట పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద గురువారం తనిఖీలు నిర్వ హించారు. వినేష్, కుమారన్ వద్ద గంజాయిని గుర్తించారు. వాహనాన్ని తనిఖీ చేస్తుండగా వారి వద్ద నాటు తుపాకీ ఉంది. 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. బిహార్‌లో ఈ తుపాకీనికి కొను గోలు చేసినట్టు వినేష్ అంగీకరించాడు. తన స్వగ్రామంలో ప్రత్యర్థులతో ఉన్న వివాదాల కారణంగా తుపాకీ కొన్నానని చెప్పినట్టు సమాచారం. కొన్నాళ్ల క్రితం బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడ హోటల్‌లో పరిచయమైన స్నేహితుడి ద్వారా దీన్ని కొనుగోలు చేశాడు. వినేష్ తన స్వగ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. అప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న వారు వినేష్‌ను అడ్డుకున్నారు. వ్యాపారం విషయంలో వినేష్‌కు వారితో గొడవలు జరిగాయి. వారి నుంచి రక్షించుకోవడానికి ఈ తుపాకీని కొనుగోలు చేశానని పోలీసులకు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.