ప్రేమోన్మాది దాడిలో ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణంపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు ఆదేశించారు. కడప జిల్లా బద్వేల్ లో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థినిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ యువతి కన్నుమూసింది. విద్యార్థినిపై దాడి విషయం తెలిసి సీఎం చంద్రబాబు శనివారం నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, చికిత్స గురించి తెలుసుకున్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడం విచారకరమని అన్నారు. కేసు విచారణకు సంబంధించి అధికారులకు సీఎం ప్రత్యేక సూచనలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడమంటే హంతకుడిని త్వరగా, చట్టబద్ధంగా శిక్షించడమే అన్నారు. నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ హెచ్చరికలా ఉండేలా ఈ నేరస్తుడికి శిక్ష పడాలని సీఎం చంద్రబాబు చెప్పారు.