ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున జనసేన పార్టీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం (అక్టోబర్ 20న) రోజున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన.. తెలంగాణ జనసేన నేతలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆర్.రాజలింగం మీడియాతో మాడ్లాడారు. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటారని నేతలు గుర్తు చేశారు.
జనసేనాని ఏ కార్యక్రమం చేపట్టినా.. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు చేయడం సెంటిమెంట్ అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా తన ప్రచార సారథి అయిన వారాహి వాహనానికి కూడా కొండగట్టు ఆలయం వద్దనే పూజలు నిర్వహించారని గుర్తు చేసిన నేతలు.. కొండగట్టు అంజన్నపై ఆయనకున్న భక్తికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు.
అయితే.. కొండగట్టు అంజనేయస్వామి ఆలయానికి వచ్చే.. భక్తుల వసతి సౌకర్యం కోసం 100 గదుల నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే.. టీటీడీ నిధులు కేటాయించటం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉందని తెలంగాణ జనసేన నేతలు స్పష్టం చేశారు. ఏళ్లుగా సాధ్యం కానీ వసతి భవన నిర్మాణం.. పవన్ కళ్యాణ్ చొరవతో కార్యరూపం దాల్చుతోందని వివరించారు. ఇందుకుగానూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చేవారికి సరైన వసతి సౌకర్యాలు లేని కారణంగా.. భక్తుల కోరిక మేరకు 100 గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు.. ఇటీవలే కొండగట్టుకు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. దీంతో.. వసతి గదులు నిర్మాణానికి తొలిఅడుగు పడ్డట్టయింది. ఇక.. త్వరలోనే ఈ భవన నిర్మాణం కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది.