వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఓ ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆమె మృతికి కారణమైన విఘ్నేశ్ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ నేడు నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కేసు వివరాలు తెలిపారు. యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు తమకు సమాచారం వచ్చిందని, సమాచారం రాగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి యువతిని ప్రాథమిక చికిత్స కోసం బద్వేలు ఆసుపత్రికి తరలించారని వివరించారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి చనిపోయిందని ఎస్పీ పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థినికి, నిందితుడు విఘ్నేశ్ కు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని వెల్లడించారు. విఘ్నేశ్ ఆరు నెలల కిందట మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. మాట్లాడుకుందామని ఇంటర్ విద్యార్థినిని రమ్మని చెప్పాడని, ఇద్దరూ కలిసి ఘటన జరిగిన ప్రాంతానికి ఆటోలో వెళ్లారని ఎస్పీ హర్షవర్ధన్ వివరించారు. పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి కోరిందని... ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. గొడవ తీవ్రతరం కావడంతో విఘ్నేశ్ ఆ అమ్మాయిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని వెల్లడించారు. అతడు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు త్వరగా ముగిస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుందని ఎస్పీ వివరించారు.