తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 31వ తేదీన టీటీడీ ఆర్జిత సేవలు రద్దు చేసింది. అక్టోబరు 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని ఈ మేరకు ఓ ప్రకటన తెలిపింది. అక్టోబర్ 31వ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. దీపావళి ఆస్థానంలో భాగంగా ఘంటా మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదన నిర్వహిస్తారు.
సాయంత్రం ఐదింటికి శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. ఆ తర్వాత స్వామివారు ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో దీపావళి ఆస్థానం కారణంగా తిరుమలలో అక్టోబర్ 31 ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలని కోరింది.
మరోవైపు కార్తీక మాసం సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరగనున్నాయి. నవంబరు 4, 11, 18, 25వ తేదీలలో తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాత సేవ తర్వాత అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 5 నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ మరోసారి అభిషేకం, సహస్రనామార్చన నిర్వహిస్తారు. అభిషేకం తర్వాత మళ్లీ రాత్రి 9 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. డిసెంబర్ ఒకటో తేదీ చండీకేశవస్వామికి అభిషేకం, త్రిశూల స్నానం నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామిని ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలు అర్చిస్తే శుభాలు కలుగుతాయని ప్రసిద్ధి.