జమ్మూకశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఒక డాక్టర్ తో పాటు ఆరుగురు నిర్మాణ రంగ కార్మికులు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ నేతలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో సత్సంబంధాలు కావాలనుకుంటే ఉగ్రవాదానికి ముగింపు పలకాలనే విషయాన్ని పాక్ నేతలకు తాను చెప్పదలుచుకున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలను గౌరవంగా బతకనివ్వాలని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్ గా మారబోదని వ్యాఖ్యానించారు. గత 75 ఏళ్లుగా గొప్ప పాకిస్థాన్ ను తయారు చేసుకోలేకపోయారని... ఇప్పుడు ఏం చేయగలుగుతారని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకాలని... లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమాయక ప్రజలను చంపుతుంటే... భారత్ తో చర్చలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. జీవనోపాధి కోసం వచ్చిన పేద కార్మికులు, ఒక డాక్టర్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారని... ఇది చాలా బాధాకరమైనదని అన్నారు.