విజయనగరం జిల్లాలోని గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. డయేరియా వల్ల 10 మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గుర్ల ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి తాను వ్యక్తిగతంగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.అయితే డయేరియా కారణంగా ఎంతమంది చనిపోయారనే విషయం ప్రభుత్వ పరిశీలనలో తేలుతుందని ఆయన తెలిపారు. ఇక గుర్లలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
ఈ గ్రామంలో అంతా బహిరంగ మలవిసర్జన జరుగుతుందని చెప్పారు. గ్రామస్తులు బహిరంగ మల విసర్జన ఆపకుంటే.. మరిన్ని గ్రామాల్లో ఇదే తరహా ఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తే.. వాటిని గత జగన్ ప్రభుత్వం పక్క దారి పట్టించిందని ఆరోపించారు. అందువల్లే ఈ పారిశుద్ధ్య లోపం తలెత్తిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. గుర్లలో పరిస్థితులపై సోమవారం సాయంత్రం జిల్లా కలెకర్ట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు.అక్టోబర్ 10వ తేదీ అనంతరం గుర్లలో డయేరియా ప్రబలింది. దీంతో గ్రామంలో పలువురు వ్యక్తులు వరుసగా మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అందులోభాగంగా గుర్లలోని పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అలాగే సమస్య తీవ్రంగా రోగులను చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, విజయనగరం జిల్లా వైద్య విదాన ఆసుపత్రితోపాటు విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. అయితే వరుస మరణాల నేపథ్యంలో గుర్ల గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.