జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత ఐదు సంవత్సరాలు వ్యవస్థలను వ్యక్తిగత అవసరాలకు, వారి స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రూ. 1674 కోట్లు బకాయిలు రైతులకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు.
ఇవాళ(మంగళవారం) ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు, ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ... రూ. 13 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని వెల్లడించారు. గోనెసంచులు హమాలి ట్రాన్స్‌పోర్ట్ ప్రభుత్వమే భరించి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.