డ్రోన్ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల విజయవాడ వరదల్లో డ్రోన్లు వినియోగించి ఆహారం, తాగునీరు అందించామని చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులని సీఎం కొనియాడారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. నివాస అనుకూల నగరాల్లో దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ అని చెప్పారు. విదేశాల్లో ఉన్న మనదేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారే ఉన్నారని చెప్పారు.‘‘ఇప్పుడు నిజమైన సంపద డేటా. భవిష్యత్తులో దేశానికైనా, కంపెనీకైనా అదే కీలకం. డేటాకు ఏఐను అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇటీవల విజయవాడ వరదల్లో డ్రోన్లు వినియోగించి ఆహారం, తాగునీరు అందించాం. వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో వాటిది కీలకపాత్ర. నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు వాడొచ్చు. భవిష్యత్తులో వైద్యరంగంలో పెనుమార్పులు రానున్నాయి. రోగులు ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చు. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతున్నాయి. మేం మాత్రం అభివృద్ధికి ఉపయోగిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగిస్తాం. పోలీసుశాఖలో విస్తృతంగా ఉపయోగించేందుకు కృషి చేస్తాం. డ్రోన్లతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి చెక్ పెడతాం’’ అని చంద్రబాబు తెలిపారు.