ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం పథకం) అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి దీపావళి పండగ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు అర్హులైన వారికి సిలిండర్లను అందజేస్తారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుండగా.. ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలిపారు.
ఈ పథకానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారు అర్హులు. మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు సులభంగా ఈ సిలిండర్ల పథకం అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి.. ఆర్థికంగా వెనకబడినవారంత అర్హులే. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రమాణికంగా తీసుకోనున్నారు. ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, నెటివిటి సర్టిఫికెట్‌లు రెడీ చేసుకుంటే మంచిది.
ఈ మూడు ఉచితం సిలిండర్ల (దీపం) పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్‌లో ఉన్న విధంగా పేరు, చిరుమానా రాయాలి. అనంతరం డాక్యుమెంట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో దరఖాస్తు పూర్తవుతుంది. ఈ అప్లికేషన్‌లను అధికారులు పరిశీలించి.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.. ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ జాబితాలను ప్రదర్శించాలని భావిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక ఇబ్బందులున్నా సరే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నామని.. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. తమకు పథకం అందలేదనే మాట అర్హుల నుంచి రాకూడదని అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు సిలిండర్ల పథకం అమలు చేస్తే.. ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,684 కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్లవుతుందని భారం పడుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.876 ఉంటే.. ఇందులో రూ.25 రాయితీ లబ్ధిదారు అకౌంట్‌లో జమ అవుతోంది. మిగిలిన రూ.851 లబ్ధిదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఉచిత సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపనున్నారు.