అమరావతి ప్రాంతానికి చెందిన యువకుడికి మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని చెబుతూనే.. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. సామాన్యుడి ట్వీట్‌కు స్పందించి సారీ చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు నారా లోకేష్. యువకుడు తన ట్వీట్‌లో.. 'ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు.. వీఐపీల రాకపోకల కారణంగా కరకట్ట రోడ్డును ప్రతి రోజూ 8 గంటల పాటూ బ్లాక్ చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్లాక్ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా రోడ్డును బ్లాక్ చేయడకుండా ఉంటే బావుంటుందని.. అన్న గంటలు బ్లాక్ చేయకుండా చూడాలి' అన్నారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేష్.. 'ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇలా రోడ్డు బ్లాక్ చేయడం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాను. ఈ అంశంపై కచ్చితంగా సమీక్ష చేసి.. సామాన్యులకు ఊరట కలిగేలా తగిన చర్యలు తీసుకుంటాము. ఈ విషయంలో ఓర్పుగా ఉండి అర్ధం చేసుకున్నందుకు అభినందిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు, వీఐపీల రాకపోకల అంశంపై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం (ఐఎస్‌డబ్ల్యూ) నిబంధనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. ఉండవల్లి గుహల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో కొండవీటి వాగు వంతెన దగ్గర ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సెక్యూరిటీ వింగ్. ఈ ఏర్పాట్లతో ఆ మార్గంలో ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ రెయిలింగ్ తరహాలో ఉండే గేటును రిమోట్ కంట్రోల్ సాయంతో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. రిమోట్ నొక్కితే చాలు అవసరమైనప్పుడు గేటు తెరుచుకుంటుంది, మూసుకుపోతుంది.
జడ్ కేటగిరీ, ఆపైన భద్రత ఉన్న ప్రముఖుల నివాసాలకు వెళ్లే మార్గాల్లో ఈ ఏర్పాట్లు సర్వసాధారణం అంటున్నారు. ఇది చాలా రద్దీగా ఉండే మార్గం.. ఇటు వైపుగా సచివాలయ ఉద్యోగులు, రైతులు, స్థానికులు రాకపోకలు కొనసాగుతాయి. దీని ఏర్పాటు గురించి ప్రజలెవరూ ఆందోళన అవసవరం లేదంటున్నారు పోలీసులు. ఈ విషయం ముందుగానే అమరావతి రైతులకు తెలియజేసి అవగాహన కల్పించాకే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు కొసాగించుకోవచ్చంటున్నారు. అత్యవసరంగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తేనే గేట్లను వినియోగిస్తామని మిగిలిన రోజుల్లో వాటి జోలికి వెళ్లేది లేదంటున్నారు. మొత్తం మీద కరకట్ట మీద చంద్రబాబు భద్రతకు సంబంధించి మార్పులు జరిగాయి.