దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల నుంచి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడింది. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న క్రమంలో.. ఈ ఉద్రిక్తతలు నెలకొనడంతో మళ్లీ ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఒక శుభవార్త చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు కొరత లేదని హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. దీంతో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. గత కొన్ని నెలలుగా హమాస్, హెజ్‌బొల్లాలను అంతం చేసేందుకు గాజా, లెబనాన్ భూభాగాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. దీర్ఘకాలంగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతంగా పెరిగేందుకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని.. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్న వేళ.. అవన్నీ నిజం కాదని.. వదంతులను నమ్మవద్దని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.
బ్రెజిల్, గయానా వంటి దేశాలు తమ పెట్రోలియం ఉత్పత్తులను గణనీయంగా పెంచుతున్నందున.. అంతర్జాతీయంగా చమురుకు కొరత లేదని హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. అంతేకాకుండా అంతర్జాతీయ అవసరాలకు తగినంత కంటే ఎక్కువ చమురు ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డిమాండ్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆశాజనకంగా తగ్గుతాయని కేంద్రమంత్రి తెలిపారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు భౌగోళికంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు ఒక కారణమని హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా దేశంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయని.. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉండేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.