కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. నిందితులకు ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాధితురాలి తండ్రి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తాము మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని అమిత్ షాకు రాసిన లేఖలో బాధితురాలి తండ్రి విజ్ఞప్తి చేశారు. తమను కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని మెయిల్ చేశారు.
తమ బిడ్డకు జరిగిన అఘాయిత్యానికి న్యాయం కోసం కుటుంబ సభ్యులం ఎదురుచూస్తున్నామని.. అయితే తమకు సాయం చేసేవారు ఎవరూ లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటన తర్వాత.. తమ కుటుంబ సభ్యులు అంతా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తాము నిస్సహాయులం అనే భావన కలుగుతోందని పేర్కొన్నారు. ఈ కేసు వీలైనంత త్వరగా పూర్తయ్యేందుకు.. తమ కుమార్తెకు న్యాయం జరిగేందుకు, మీరు మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై మాట్లాడేందుకు మీరు అపాయింట్‌మెంట్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ లేఖలో బాధితురాలి తండ్రి తెలిపారు. ఈ మేరకు అమిత్ షాకు ఈ-మెయిల్ చేశారు.
కోల్‌కతా హత్యాచార ఘటన తర్వాత దేశం మొత్తం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ హత్యాచార ఘటన తర్వాత తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ.. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో దీక్ష కారణంగా కొందరు జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో అప్రమత్తమైన మమతా బెనర్జీ ప్రభుత్వం.. వారితో చర్చలు జరిపింది. అవి సఫలం కావడంతో వారు దీక్ష విరమించారు.