అతనే సర్వస్వం అనుకుంది. అతనితోనే జీవితమని భావించింది. ఒకటీ, రెండు కాదు నాలుగేళ్లు ఇద్దరి మధ్య ప్రేమ నడిచింది. పార్కులు, సెల్ ఫోన్ ముచ్చట్లూ ఇలా ఏడేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఇక అతనితోనే దాంపత్య జీవితం గడపాలని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి.. పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిని కోరింది. దీంతో అప్పటి వరకూ తన అవసరాల కోసం ఆమెను వాడుకున్న అతను.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అంతటితో ఆగకుండా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది తెలిసీ ఆ యువతి ప్రశ్నిస్తే.. వదిలించుకునే ప్రయత్నం చేశాడు. నువ్వు లేకపోతే బతకలేనంటే.. చావమంటూ ప్రేరేపించాడు. అక్కడితో ఆగకుండా పురుగుల మందు కొనుక్కుని చనిపోవాలని.. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడూ ఆ కిరాతకుడు. అన్నేళ్ల ప్రేమ బంధాన్ని వీడలేక.. మనసు పడినవాడిని మరువలేక.. పాపం ఆ అమాయకురాలు.. పురుగుల మందు తాగి తనువు చాలించింది.
ఈ ఘటన కాకినాడ జిల్లాలో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గొడారిగుంటకు చెందిన 22 ఏళ్ల యువతి.. ఇసుకపల్లికి చెందిన ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఇటీవల ఆ యువతి.. తనను పెళ్లిచేసుకోవాలని ఉమామహేశ్వరరావును అడిగింది. దీనికి అతను నిరాకరించాడు. అప్పటి నుంచి కనిపించడం మానేశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ అమ్మాయి బెదిరించింది. అయినప్పటికీ అతను భయపడలేదు. పైగా పురుగుల మందు ఫలానా చోట దొరుకుతుందనే సలహా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత పురుగులమందు కొనుక్కునేందుకు ఫోన్ పే ద్వారా డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో.. సెప్టెంబర్ నెల 29న యువతి పురుగుల మందు కొనుక్కుంది.
అయితే ఉమామహేశ్వరరావు ఇటీవలే మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అక్టోబర్ 14వ తేదీన ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఈనెల 15న మృతిచెందింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
అయితే పెళ్లికి నిరాకరించాడనే కారణంతో యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తొలుత భావించారు. కానీ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోమని ప్రియురాలికి సలహా ఇచ్చింది ఉమామహేశ్వరరావేనని గుర్తించారు. యువతి ఫెర్టిలైజర్ షాపుకు వెళ్లి పురుగుల మందు కొన్నాక.. అక్కడున్న యూపీఐ కోడ్‌ను ఉమామహేశ్వరరావుకు పంపిందని.. అతడు ఫోన్‌పే ద్వారా 270 రూపాయలు చెల్లించాడని పోలీసులు తెలిపారు.