సోమల మండలంలో సోమవారం రాత్రి నుండి భారీ వర్షం కురిసింది. 67మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రెండు కల్వర్టులు కొట్టుకుపోయాయి.వీటిని సందర్శించేందుకు మంగళవారం సోమలకు వచ్చిన కలెక్టర్ సుమిత్ కుమార్ నంజంపేట మార్గంలోని సరస్వతీపురం వద్ద జీడిరేవుల వంక ఉధృతంగా ప్రవహించి తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోవడంతో పెద్దఉప్పరపల్లె గార్గేయ నది వద్దకు వెళ్లలేకపోయారు. దీంతో సోమలలోనే మండల స్ధాయి అధికారులతో సమీక్షించారు. వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గురువారం భారీ వర్షంతో గార్గేయ నది ఉధృతంగా ప్రవహించి మూడు కల్వర్టులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పేటూరు, బోనమంద, చిన్నకమ్మపల్లె, దుర్గంకొండ, బసవపల్లె గ్రామాల ప్రజల రాకపోకలకోసం టీడీపీ నేతలు, అధికారులు సోమవారం సాయంత్రం పెద్దఉప్పరపల్లెవద్ద తాత్కాలిక కల్వర్టు పనులు పూర్తిచేశారు.
రాకపోకలను పునరుద్ధరించిన నాలుగు గంటల వ్యవధిలోనే పెద్దఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె, పేటూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోయి పలుగ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. చిన్నకమ్మపల్లె వద్ద విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ మోటర్లు నీటమునిగాయి. టమోటా, వరి పొలాల్లో వర్షపు నీరు ప్రవహించి పంట నష్టం జరిగింది. రెడ్డివారిపల్లె మార్గంలో గార్గేయ నది ఉధృత ప్రవాహంతో ప్రజల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పట్రపల్లె వద్దఉన్న మరో మార్గం ద్వారా రెడ్డివారిపల్లె ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. సరస్వతీపురం జీడిరేవుల వంక వద్ద నాలుగేళ్ల కిత్రం నిర్మించిన తాత్కాలిక కల్వర్టు సోమవారం రాత్రి కొట్టుకుపోవడంతో సోమల - పెద్దఉప్పరపల్లె మార్గంలో ప్రయాణించే బస్సులను సూరయ్యగారిపల్లె, తుగడంవారిపల్లె, పొదలకుంట్ల పల్లె మార్గంలో నడుపుతున్నారు.మంగళవారం పంచాయతీరాజ్ డీడీ చంద్రశేఖర రెడ్డి, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ ఉమాపతి నాయుడు, తహసీల్దార్ బెన్నిరాజ్, ఎంపీడీవో నారాయణ కొట్టుకుపోయిన కల్వర్టులను పరిశీలించారు. చిన్నకమ్మపల్లె, బోనమంద ప్రాంతాల్లో కూలిన పలు విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ట్రాన్స్‌కో ఏఈ మహేంద్రరెడ్డి, లైన్‌మెన్ విష్ణువర్ధన రెడ్డి, నవీన్ రాయల్ నాటించారు.