చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిరుతపులి దాని గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దాని దంతాలు కూడా తొలగించిన ఘటన అమానవీయమని పవన్ కళ్యాణ్ అన్నారు.
చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని అన్నారు. ఏపీ వ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వన్యప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.