ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 30 నుంచి వాట్సాప్ బిజినెస్ ద్వారా అందుబాటులోకి పౌరసేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 09:33 PM

పౌరసేవల డెలివరీ మెకానిజంను సులభతరం చేయడానికి గాను మెటా, ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫాంగా పలురకాల పౌరసేవలను ప్రజలకు అందిస్తుంది. వాట్సాప్ మూడు ప్రాథమిక నమూనాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డెలివరీ ప్లాట్ ఫాంగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.


1). G2C (ప్రభుత్వం నుండి పౌరులకు)


2). B2C (వ్యాపారం నుండి వినియోగదారునికి)


3). G2G (ప్రభుత్వం నుండి ప్రభుత్వం)


ఏపీ ప్రభుత్వం 30, నవంబర్, 2024 నాటికి వాట్సాప్ ద్వారా 100 రకాల సేవలను ప్రవేశపెట్టడానికి కంకణబద్ధమై ఉంది. మొదటి దశలో వాణిజ్యరంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజనీరింగ్ ప్రక్రియ, విధానాలను అమలు చేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. ఈ ప్రక్రియలో, ఈ క్రింది విధంగా వివిధ రకాల సేవలను అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.


1. ఎండోమెంట్ సేవలు: 


రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధ రకాల సేవల కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవడం వంటి సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.


2. రెవెన్యూ సేవలు:


పౌరులు వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. పారదర్శకమైన యాక్సెస్‌తో సర్వే నంబర్లు, భూభాగాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి. సర్వే నంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడంలో సహాయం అందుంది. ఈ సమాచారాన్ని స్వతంత్రంగా కనుగొనడంలో వినియోగదారుల యాక్సెసిబిలిటీని మెరుగుపర్చుతారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థనలను క్రమబద్ధీకరిస్తారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం పౌరులకు లభిస్తుంది.


3. పౌర సరఫరాలు


పౌరులు రేషన్ కార్డ్‌ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాక రేషన్ కార్డులను జారీ చేయడం, రేషన్ పంపిణీ స్టేటస్‌ అప్ డేట్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.


4. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్స్


కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఏర్పడుతుంది. 


5. నమోదు


రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి వాట్సాప్‌ సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తుంది. భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్‌లు, సర్టిఫికెట్‌లు జారీ, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడానికి అవకాశమేర్పడుతుంది. 


6. విద్యుత్ శాఖ


విద్యుత్ శాఖలోని ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ బిల్లు చెల్లింపునకు వాట్సాప్ ద్వారా అవకాశం లభిస్తుంది. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హై-టెన్షన్ లైన్‌లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఇన్‌స్టాల్ చేయడం, ట్రాన్స్‌కో, అంతర్గత కమ్యూనికేషన్ ఛానెల్‌లు, అలర్ట్ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయి.


7. పరిశ్రమలు


పరిశ్రమల శాఖ ఇప్పటికే ఔట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్‌బాట్‌లను ఉపయోగిస్తోంది. యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ఏకీకృతం చేయడం కోసం విధివిధానాలు సిద్ధమయ్యాయి. భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేయడం, పెట్టుబడి విధానం, ప్రమోషన్ వంటివాటికి అవకాశం లభిస్తుంది.


8. రవాణాశాఖ


అన్ని రవాణా లైసెన్స్‌లకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి, వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫేస్‌లెస్ సర్వీస్‌లను వాట్సాప్‌తో ఏకీకృతం చేసి సేవలను అందుబాటులోకి తెస్తారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ మోడల్‌లో ఎపిఎస్ ఆర్టీసితో మెటా టీమ్ కలిసి పని చేస్తుంది. టిక్కెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్‌ల కోసం ఏపీఎస్‌ఆర్టీసీలో సేవలను ఏకీకృతం చేస్తారు.


9. పాఠశాల విద్య


తల్లిదండ్రులు, విద్యార్థులు, డిపార్ట్‌మెంట్ కార్యనిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం వంటి సేవలు వాట్సాప్‌తో అనుసంధానం చేయడం వల్ల సులభతరమవుతాయి. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ ప్రామాణీకరణతో మెసేజింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. పాఠ్యప్రణాళిక ఫలితాలను ట్రాక్ చేయడంతోపాటు మెటా బృందం డిజిటల్ నాగ్రిక్ వంటి అదనపు కోర్సులను కూడా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తుంది. 


10. ఉన్నత విద్య


ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు మొదలైన వాటి కోసం హెచ్చరికలను షెడ్యూల్ చేయడం వంటి సమాచారం అప్ డేట్‌గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. స్టూడెంట్-స్టాఫ్ సపోర్ట్ సర్వీసెస్, వర్చువల్ టీచింగ్ అసిస్టెన్స్, కమ్యూనికేషన్, ఇతర సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచడానికి ఎల్ఎంఎస్ వంటివి అందుబాటులోకి వస్తాయి. విద్యా సేవలకు అంతరాయంలేని యాక్సెస్ కోసం ఏపీఏఏఆర్ ఐడీని అనుసంధానిస్తారు. డ్రగ్, పొగాకు రహిత క్యాంపస్‌ల కోసం ప్రచారాలు, యూనివర్శిటీల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. 


11. నైపుణ్యాల అభివృద్ధి & శిక్షణ


భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పలురకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. స్కిల్ డెవలప్‌మెంట్ అవసరాలపై డేటాను సేకరించేందుకు స్కిల్ సెన్సస్ నిర్వహించడంలో మెటా సహకరిస్తుంది. మెటా బృందం వాయిస్/టెక్స్ట్ ద్వారా డైనమిక్ ప్రతిస్పందనల కోసం AIని ఏకీకృతం చేస్తుంది.


12. ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ


ఆయా శాఖల్లో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను నిర్ధారించడం కీలకం. వాట్సాప్ అనేది అదనపు కమ్యూనికేషన్ ఛానెల్ మాత్రమే. మొత్తం డేటా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇంటిగ్రేషన్ కోసం వైట్‌లిస్ట్ చేయదగిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తారు. డిపార్ట్‌మెంటల్ సమాచారం ఇంటిగ్రేషన్ కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రణాళికను తయారుచేసి నిర్ణీత కాలవ్యవధిలో ఏకీకృతంచేస్తారు. 


13. గ్రామ సచివాలయాలు, వార్డుసచివాలయ విభాగం


గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ కోసం 29 విభాగాల్లో 350+ సేవలు ఇప్పటికే ఏకీకృతం చేయబడ్డాయి. వివిధ విభాగాలకు అనుసంధానించడం ద్వారా ఇతర డైనమిక్ సేవలను సమాంతరంగా అందుబాటులోకి తెస్తారు. వాట్సాప్ గంటకు 10 లక్షల అలర్ట్‌ల సామర్థ్యంతో రియల్ టైమ్ నోటిఫికేషన్‌లను సులభతరం చేస్తుంది. పర్యాటకరంగానికి సంబంధించి అవసరమైన అప్ డేట్లు, ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేయడానికి క్రమబద్ధమైన వేదికగా ఉపకరిస్తుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లు, రహదారి పరిస్థితులు వంటివాటిపై రెగ్యులర్ అప్‌డేట్‌లు లభిస్తాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు, వాతావరణం, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందవచ్చు. వివిధ పన్నులకు సంబంధించిన సమాచారం, గడువులు, విధానాలపై కమ్యూనికేషన్ సులభతరమవుతుంది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లో క్రమబద్ధీకరణ మెరుగుపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com