కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ మహర్దశ పట్టింది. తాజాగా, అమరావతి రైల్వేలైన్ కు కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఈ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా 57 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం రూ.2,245 కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. గుంటూరు, విజయవాడ నగరాలను కవర్ చేసేలా రాజధాని పక్కగా ఈ రైల్వే లైన్ వెళుతుందని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులకు ఈ రైల్వే లైన్ ద్వారా అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన అమరావతి రైల్వే ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రైల్వే లైను కృష్ణా నదిపై వెళుతుందని, ఇది ఎంతో రమణీయంగా ఉంటుందని చంద్రబాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా కృష్ణా నదిపై కట్టే రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరుతున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నగరం దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటవుతుందని, ఈ నగరం నిర్మాణానికి కేంద్రం అనేక మార్గాల్లో సాయం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. చాలా తక్కువ సమయంలోనే అమరావతి అంశాన్ని ప్రధాని మోదీ క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లారని, అంతేకాకుండా, క్యాబినెట్ ఆమోదం కూడా లభించిందని అన్నారు.