వైసీపీ హయాంలో రూ.200 కోట్లకుపైగా విలువ చేసే భూమిని అప్పనంగా రూ.15 లక్షలకు కట్టబెట్టిన వ్యవహారం పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం శారదా పీఠానికి గత సర్కార్ కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంది. దీంతో శారదా పీఠం ఆక్రమణలకు చెక్ పడినట్లైంది. అయితే ఇప్పుడు అందరి చూపు తిరుమల వైపే ఉంది. ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గోగర్భం ఆనకట్ట ప్రాంతంలో శారదా పీఠానికి గత సర్కార్ భూమి లీజుకు ఇచ్చింది. ఆ భూమిలో అనుమతులు మీరి డీవియేషన్లు ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ హయాంలో వీటిని సరిచేసేందుకు అనుమతి కోరుతూ శారదాపీఠం నుంచి టీటీడీ బోర్డుకు అభ్యర్థనలు వచ్చాయి.
ఈ అభ్యర్థనకు టీటీడీ బోర్డు 2023 డిసెంబర్ 26న ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఈ ప్రతిపాదన కూటమి సర్కార్ ముందుకు వచ్చింది. దాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరించింది. మరోవైపు ఈ అంశంపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామల రావును ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ముందస్తు అనుమతి కోసం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. శారదా పీఠానికి భూ కేటాయింపులపై కేబినెట్‌లోనూ చర్చ జరిగింది.